2025 G20 Johannesburg Summit: జోహాన్నెస్‌బర్గ్‌లో మొదలైన జీ20 సదస్సు.. మోదీ 4 కీలక ప్రతిపాదనలు!

2025 G20 Johannesburg Summit: శనివారం దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచించారు. ప్రారంభ సెషన్‌లో ప్రసంగించిన ఆయన, ప్రపంచ అభివృద్ధి ప్రమాణాలను పునఃపరిశీలించే సమయం వచ్చిందని స్పష్టంగా చెప్పారు. సమ్మిళిత, సుస్థిర వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నాలుగు కీలకమైన, వినూత్నమైన కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా తొలిసారి జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న సందర్భంలో, అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు.

2025 G20 Johannesburg Summit
2025 G20 Johannesburg Summit

‘సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి’ అంశంపై జరిగిన సెషన్‌లో మోదీ మాట్లాడుతూ, భారతదేశపు ప్రాచీన నాగరికతా విలువలు, ముఖ్యంగా ఏకాత్మ మానవతావాదం (Integral Humanism) ప్రపంచానికి దారి చూపగలవని పేర్కొన్నారు. అనంతరం తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.

Also Read: ప్రధానమంత్రి మోదీ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం!

మోదీ ప్రతిపాదించిన నాలుగు కీలక కార్యక్రమాలు

1. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ
మోదీ మొదటి ప్రతిపాదనగా జీ20 ఆధ్వర్యంలో ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ’ని ఏర్పాటు చేయాలని సూచించారు. సాంప్రదాయ విజ్ఞానం, పర్యావరణహిత జీవన విధానాలు, సాంస్కృతిక విలువలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ దీనికి బలమైన ప్రాతిపదికగా నిలుస్తుందని తెలిపారు.

2. జీ20-ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్
రెండో ప్రతిపాదనగా ఆఫ్రికా అభివృద్ధికి ‘జీ20-ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్’ను ప్రకటించారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో 10 లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రపంచ పురోగతికి ఆఫ్రికా అభివృద్ధి కీలకమని మోదీ స్పష్టం చేశారు.

3. డ్రగ్స్-టెర్రర్ నెక్సస్‌కు ఎదురుదెబ్బ
ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ విస్తృత వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు ఉగ్రవాదానికి ఆర్థిక సహకారాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి జీ20 దేశాలు కలిసి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కోవడం ఇప్పుడు అత్యవసరమని ఆయన తెలిపారు.

4. జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్
చివరి ప్రతిపాదనగా ‘జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వేగంగా స్పందించేలా జీ20 దేశాల వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.


Post a Comment (0)
Previous Post Next Post